RRR టీజర్‌పై కోర్టుకు వెళ్తామంటున్న ఆదివాసీలు.. ఎందుకంటే?

Saturday, October 24th, 2020, 05:00:38 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే దసరా కానుకగా మరియు కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఆదివాసీల వీరుడు, మన్యం పులి ముద్దుబిడ్డ కొమురం భీమ్ వీరత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉండడంతో ఈ సినిమాపై అబిమానుల అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. చరిత్రను వక్రీకరించకుండా సినిమా నిర్మాణం చేపట్టాలని కొందరు సూచిస్తుంటే, మరికొందరు మాత్రం ఫిక్షనల్ అని ముందే చెప్పారుగా అంటూ రాజమౌళికి మద్ధతు తెలుపుతున్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. అయితే తమ ఆదివాసీ నాయకుడిని కించపరిచేలా చిత్రీకరించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని లేదంటే దీనిపై కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని ఆదివాసీ సంఘాలు చిత్రయూనిట్‌ను హెచ్చరిస్తున్నాయి.