రివ్యూ రాజా తీన్‌మార్ : రారండోయ్ వేడుక చూద్దాం – ఈ వేడుక యావరేజ్ గానే జరిగింది

Friday, May 26th, 2017, 06:00:54 PM IST


తెరపై కనిపించిన వారు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ : కళ్యాణ్ కృష్ణ

మూల కథ :

ఇంట్లో వాళ్ళ మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తండ్రి ఆది (సంపత్) కి భ్రమరాంబ అంటే ఎంతో ఇష్టం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా గారాబంగాపెరిగిన భ్రమరాంభను ఒక పెళ్లిలో చూసి ప్రేమిస్తాడు శివ (నాగ చైతన్య).

ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్ కు చదువుకోడానికి వచ్చి శివకు దగ్గరవుతుంది. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు, శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి ? ఈ పగల మధ్య శివ, భ్రమరాంభల ప్రేమ ఏమైంది ? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు ? అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :

–> కథకు ప్రధానమైన భ్రమరాంభ పాత్రను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా బాగా డిజైన్ చేశారు. ఆమె కనిపించే ప్రతి సీన్ సరదా సరదాగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాత్రకు ఇంతటి ప్రమముఖ్యత ఇవ్వడం ఇదేనని చెప్పొచ్చు. కనుక భ్రమరాంభకు మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> హీరోయిన్ రకు ప్రీత్ సింగ్ తన నటనతో కట్టిపడేయగా, హీరో నాగ చైతన్య నటనలో చాలా పరిణితి ప్రదర్శించి ముఖ్యమైన సన్నివేశాల్లో బాగా నటించాడు. కాబట్టి రెండవ విజిల్ వారిద్దరికీ వేయొచ్చు.

–> ఫస్టాఫ్ ఇంటర్వెల్ లో దర్శకుడిచ్చిన చినన్ ట్విస్ట్, సెకండాఫ్లో కొంత కథనం, వెన్నెల కిషోర్ కామెడీ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. చివరి విజిల్ వీటికి వేయచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఫస్టాఫ్ మొదటి 10 నిముషాల బాగున్నా ఆ తర్వాత తర్వాత సినిమాను ఏదో కాలయాపన కోసం నడిపినట్టు నడిపాడు దర్శకుడు. దీంతో ఎప్పుడెప్పుడు అసలు కథ మొదలవుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది.

–> ఇక కళ్యాణ్ కృష్ణ ఎంచుకునే కథ, కథనం అన్నీ రొటీన్ గానే ఉండటంతో సినిమాలో హీరోయిన్ పాటర్ మినహా కొత్తదనమేమీ కనబడలేదు.

–> దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మంచి పాటల్ని కళ్యాణ్ కృష్ణ సరైన రీతిలో వినియోగించుకోలేకపోయాడు. దీంతో పాటలు చాలా వరకు తేలిపోయాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో మరీ అంత వింతగా అనిపించే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమా స్థాయిలో ఈ సినిమాని తీయలేదు.
మిస్టర్ బి: అవును. నాకు అదే అనిపించింది.
మిస్టర్ ఏ: ట్రైలర్ చూసి సోగ్గాడ్ని మించి ఉంటుందని అనుకున్నా.
మిస్టర్ బి: కానీ ఈ వేడుక చూస్తే యావరేజ్ గానే జరిగింది