త్వరలో వెండితెర పైకి రోజా తనయ!

Wednesday, March 11th, 2015, 11:45:05 AM IST


దక్షిణాదిన పలు భాషలలో నటించి చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటి రోజా అంటే తెలియని వారుండరు. ఇక చిత్ర రంగంలోనే కాకుండా రోజా ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుండి శాసన సభకు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది అటు రాజకీయాలలో కూడా తన సత్తా చాటారు. అయితే నటిగా మంచి ఫాంలో ఉండగానే తనను తమిళ తెరకు పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఇప్పుడు అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రోజా పూర్తి సమయాన్ని రాజకీయాలకే అంకితం చేసారు.

ఇక ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా తన కూతురు అన్షు మాలిక్ తో కలిసి రోజా ఉన్న ఫోటో ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటోను చూసిన పలువురు దర్శక, నిర్మాతలు 12ఏళ్ళ అన్షును వెండి తెరకు పరిచయం చెయ్యడానికి ప్రయత్నాలు మొదలెట్టారట. ఇక ఇప్పటికే బుల్లితెర బాలనటిగా పేరు పొందిన అన్షు మాళికను వెండితెరపై కూడా మెరిపింప చేయడానికి రోజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇదే గనుక నిజమైతే త్వరలోనే బుల్లి రోజాను వెండితెరపై చూడవచ్చు.