వకీల్ సాబ్‌కి సుప్రీం కోర్టు మాజీ జడ్జి కితాబు.. ఏమన్నారంటే?

Tuesday, April 20th, 2021, 11:46:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మంచి మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రం కావడంతో ఈ సినిమాకు చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

అయితే వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనపై తాజాగా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లకి వకీల్ సాబ్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాటం ఓ చిత్రంగా వచ్చిందని, మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని అన్నారు. సాధారణంగా ఇలాంటి సందేశాత్మక చిత్రాలను పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చెయ్యరని, కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతి ఒక్కరి స్వేచ్చ, స్వాతంత్రం కోసం మదనపడే వ్యక్తి అని, ముఖ్యంగా మహిళలకు, రైతులకు, ఆదివాసీలకు, దళితులకు జరిగిన అన్యాయాలపై తిరుగుబాటు చేసిన వ్యక్తి అని అందుకే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రలో నటించడం కాదు జీవించేశారని అన్నారు.