‘పద్మశ్ర్రీ’ ఇవ్వనందుకు ప్రముఖ నటుడి ఆవేదన!

Thursday, December 4th, 2014, 11:35:26 AM IST


ప్రముఖ తెలుగు అలనాటి మేటి నటుడు కైకాల సత్యనారాయణను మరొక ప్రముఖ నటుడు కాంతారావు పేరిట జరిగిన సన్మాన సభ కార్యక్రమంలో వెండి కిరీటం తొడిగి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కైకాల మాట్లాడుతూ తనకు ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పాతికేళ్ళ క్రితమే ‘పద్మశ్రీ’ పురస్కారానికి తన పేరును ప్రతిపాదించారని, కాని ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. అలాగే తాను టిడిపి ఎంపీగా ఉన్నందుకు తనకు అప్పట్లో పద్మశ్రీ ఇవ్వలేదని, అయితే ఆ తర్వాత అయినా తనకు ఆ పురస్కారం ఇచ్చి ఉండవచ్చునని కాని అలా జరగలేదని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కైకాల సత్యనారాయణ లాగే ‘పద్మ’ అవార్డులకు అర్హత కలిగినవారు చాలా మంది ఉన్నా, ఎందుకో గాని వారందరి పేర్లు మరుగునపడుతున్నాయి. ఇక ఇప్పటి నుండైన ప్రభుత్వం ఇతరత్రా అంశాలను పక్కనపెట్టి అర్హతను బట్టి అవార్డులు ప్రకటిస్తుందని ఆశిద్దాం.