రివ్యూ రాజా తీన్‌మార్ : విన్నర్ – సగంలో దెబ్బైపోయాడు !

Friday, February 24th, 2017, 04:50:27 PM IST

తెరపై కనిపించిన వారు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘విన్నర్’ : గోపిచంద్ మలినేని

మూలకథ :

తండ్రి మహేందర్ రెడ్డి (జగపతిబాబు) గుర్రపు పందేల గొడవలో పడి తనను నిర్లక్ష్యం చేయడంతో కోపంతో అతనికి కొడుకు సిద్దార్ధ్ (ధరమ్ తేజ్) ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అలా తండ్రికి దూరంగా పెరిగిన సిద్దార్థ్, సితార (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమిస్తాడు. అంతలోనే సితార నాన్న ఆమెకు వేరొకరితో పెళ్లి ఖాయం చేస్తాడు. ఆ పెళ్లి తప్పించుకోవడానికి సితార తను సిద్దార్థ్ ను ప్రేమిస్తున్నానని తన తండ్రితో అబద్దం చెప్పి బెట్ కడుతుంది.

సిద్దార్థ్ కూడా సితార కోసం ప్రపంచంలోనే నెంబర్ వన్ జాకీ అయిన ఆదితో రేసుకు దిగుతాడు. అదే సమయంలో సిద్దార్థ్ తను చిన్నతనంలో దూరమైన తండ్రి ప్రేమను గెలుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇలా సితార, తండ్రి ప్రేమల కోసం రేసుకు దిగిన సిద్దార్థ్ తనకు అడ్డుపడుతున్న ఆదిని ఎలా ఎదుర్కొంటాడు ? అసలు ఆది ఎవరు ? అతని సిద్దార్థ్ జీవితంలోకి ఎలా వచ్చాడు ? చివరికి సిద్దార్థ్ విన్నర్ ఎలా అయ్యాడు ? అనేదే కథ.

విజిల్ పోడు :
–> కమర్షియల్ ఎంటర్టైనర్లలో కథ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ఈ సినిమాలో మాత్రం హార్స్ రేస్ నైపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథనూ తయారు చేశాడు దర్శకుడు మలినేని గోపిచంద్. కనుక అతనికొక విజిల్ వేసుకోవచ్చు.

–> ఆసక్తికరంగా మొదలైన ఫస్టాఫ్ వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి, పృథ్విల కామెడీతో మంచి నవ్వులు పూయించింది. ముఖ్యంగా రకుల్, తేజ్, పృథ్విల మధ్య నడిచే కామెడీ ట్రాక్ బాగుంది.

–> అప్పటిదాకా కామెడీతో సాగిన ఫస్టాఫ్ మంచి ఇంటర్వెల్ ట్విస్టుతో సెకండాఫ్ లో ఎం జరగబోతుందో అనే ఆసక్తిని పెంచి కాస్త కిక్ ఇచ్చింది. కనుక ఈ మలుపుకు చివరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఇంటర్వెల్ ముందు వరకు బాగున్నా బ్రేక్ తర్వాత మాత్రం ఆడియన్సుతో చెడుగుడాడుకుంది. కథనం అర్థం పర్థం లేకుండా ఊహించుకున్న దానికి కనీసం 20 శాతం కూడా న్యాయం చేయకుండా చాలా చాలా రొటీన్ గా బోర్ కొట్టించి వదిలిపెట్టింది. సెకండాఫ్ చూస్తే అసలు సినిమా విన్నరేనా లేకపోతె వేరే ఏదైనాన అనే సందేహం తలెత్తుతుంది.

–> మెగాస్టార్ స్టైల్లో డ్యాన్సులు చేయగల తేజ్ ఈ సినిమాలో మాత్రం అస్సలు డ్యాన్సులా గురించి ఆలోచించినట్టే లేదు. ఎక్కడా ఒళ్ళు వంచకుండా లాగించేద్దామనుకుని ప్రేక్షకులను నిరుత్సాహపరచి బోర్లాపడ్డాడు.

–> సినిమాకి కీలకమైన క్లైమాక్స్ కూడా చూస్తే ఇక సినిమా అయిపోయింది పదండి పదండి అన్నట్టుందే గాని ప్రేక్షకుడిని సంతృప్తిపరిచేలా లేదు. దీంతో అప్పటిదాకా ఉన్న అసంతృప్తి ఇంకాస్త ఎక్కువైంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఇంటర్వెల్ లో హీరోతో ఛాలెంజ్ చేసిన జగపతిబాబు ఉన్నట్టుండి ఇంటెర్వె తర్వాత అతని పట్ల చాలా స్మూత్ గా ప్రవర్తించడం ఇదేం స్క్రీన్ ప్లే నాయనా అనేంత వింతగా అనిపించింది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల ముచ్చట ఇలా ఉంది..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉందిరా ?
మిస్టర్ బి : ఫస్టాఫ్ వరకు ఓకే.. ఆ తర్వాతే తలపగిలింది.
మిస్టర్ ఏ : అవును.. సెకండాఫ్ ఇంకాస్త బాగా చేసుండాల్సింది.
మిస్టర్ బి : పైగా డ్యాన్సులు కూడా వేయలేదు.
మిస్టర్ ఏ : అవును.. అదొకటుంది మళ్ళీ.
మిస్టర్ బి : మొత్తం మీద ఈ ‘విన్నర్’ సగం దెబ్బైపోయింది.