20కోట్లు అవసరమా ‘బాబు’?

Saturday, October 4th, 2014, 09:37:11 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని వేదపండితుల అశీర్వచనాల నడుమ లాంఛనంగా సచివాలయంలోని తన నూతన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతానికి ప్రవేశించారు. అటుపై తన కార్యకలాపాలను సచివాలయం నుండి ప్రారంభించారు. అయితే ఇంతవరకు కూడా చంద్రబాబు లేక్ వ్యూ అతిధి గృహాన్నే తన క్యాంపు కార్యాలయంగా వాడుకున్నారు. ఇక విభజనకు పూర్వం సచివాలయం సీ బ్లాక్ లోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేటాయించడంతో, ఎల్ బ్లాకులోని 8వ అంతస్తులో సకల హంగులతో ఏపీ సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఈ కార్యాలయ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 20కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందట. కాగా కార్యాలయం మొత్తం బులెట్ ప్రూఫ్ కవచంతో కప్పబడి ఉందని సమాచారం. ఇక ఎల్ బ్లాక్ 8వ అంతస్తులో సీఎం చాంబర్, ఒక కాన్ఫెరెన్స్ హాలు, కేబినేట్ సమావేశాల కోసం మరో హాలు, విజిటర్ల కోసం మరో ప్రత్యేక లాంజ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఇంట సొమ్మును వెచ్చించడం అనవసరమని, పైగా రెండు, మూడేళ్ళు మాత్రమే వినియోగించే కార్యాలయం కోసం ఇంత వృధా ఖర్చు చెయ్యడం వ్యర్ధమని పలువురు విమర్శిస్తున్నారు.