ముంబై ఘటన భవిష్యత్తులో పునరావృతం అవుతుందా..?

Thursday, November 26th, 2015, 06:01:49 PM IST


26/11.. దేశ ప్రజలు మర్చిపోలేని రోజు. ముంబైలో ముష్కరులు రెచ్చిపోయిన రోజు. పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా వచ్చిన తీవ్రవాదులు ముంబైలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి తాజ్ మహల్ హోటల్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ లపై దాడికి పాల్పడ్డారు. ముష్కరులు జరిపిన దాడిలో అమాయక ప్రజలు అనేక మంది మరణించారు. వెంటనే స్పందించిన భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. కసబ్ అనే తీవ్రవాదిని సజీవంగా పట్టుకొని విచారించి.. ఇటీవలే అతడిని ఉరి తీసింది.

అయితే, ముంబై తరహా దాడులు చేసేందుకు.. ముష్కరులు పధకాలు రచిస్తూనే ఉన్నారు. ఇటీవలే గుజరాత్ ప్రవేశించాలని చూసిన ఓ పడవను నేవీ అధికారులు ద్వంసం చేశారు. ఇక,కాశ్మీర్ లో అయితే చెప్పక్కరలేదు. కాశ్మీర్ లోకి ప్రవేశించేందుకు నిత్యం ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, వారి ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతూనే ఉన్నది. ఒక్క భారత్ పైనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచంలోని దేశాలు ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలించేందుకు ఒక్కటికావలసి ఉన్నది. లేదంటే మాత్రం ఉగ్రవాదం మరింత బలపడే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు.