సూర్యాపేటలో కరోనా కలకలం రేపుతుంది. ఇటీవల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని యాదాద్రి టౌన్ షిప్లో డిసెంబర్ 25న ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అతడి అంత్యక్రియలకు హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి పాల్గొన్నారు. అయితే సూర్యాపేట నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అతడు అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో డిసెంబర్ 31న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
అయితే అతడు సూర్యాపేటలోని అంత్యక్రియలకు హాజరైన వారి కుటుంబ సభ్యులకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, మీరు కూడా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. దీంతో ఆ అంత్యక్రియలకు హాజరైన వారిలో 38 మంది టెస్టులు చేయించుకోగా వారిలో 22 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వారిని క్వారంటైన్లో పెట్టారు. అంతేకాదు అంత్యక్రియలకు హాజరయిన వారందరూ కూడా క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు.