ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 47 మంది పోలీసులకు జీవిత ఖైదు పడింది

Monday, April 4th, 2016, 07:17:04 PM IST


చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనడానికి ఈరోజు సీబీఐ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పే నిదర్శనం. సుమారు 25 ఏళ్ల క్రితం 1991 లో ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ వద్ద జరిగిన నకిలీ ఎన్ కౌంటర్ లో ఈరోజు కోర్టు సంచలన తీర్పు వెలువడింది. 1991 జులై 21న పిలిభిత్ వద్ద సిక్కు యాత్రికులతో కూడిన ఓ బస్సును ఆపిన పోలీసులు అందులోని 10 మంది సిక్కు యాత్రికులను బయటకు తీసుకొచ్చి టెరరిస్టులన్న నెపంతో కాల్చి చంపారు.

ఎఫ్ఫైఆర్ ప్రకారం ఆ 10మందిని 3 గ్రూపులుగా విడదీసి అడవుల్లోకి తీసుకెళ్ళి ఖలిస్థాని టెర్రరిస్టులన్న నెపంతో కాల్చి చంపారు. కేవలం అవార్డుల కోసం, దేశంలోని టెర్రరిస్టులను వేటాడుతున్నారు అన్న పేరు కోసమే పోలీసులు ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు తెలిసింది. మొదట దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దీన్ని సీబీఐకి అప్పగించింది. మొత్తం 57 మంది పోలీసులు ఇందులో నిందితులుగా ఉండగా ఇప్పటికే 10 మంది చనిపోయారు. మిగిలిన 47 మందికి సీబీఐ కోర్టు ఈరోజు జీవిత ఖైదు విధించింది.