ఆల్సేషన్ కుక్కకు ‘బామ్మ’ కాటు!

Friday, June 19th, 2015, 01:39:13 PM IST


సహజంగా కుక్కలు మనిషిని కరవడం చూస్తూ ఉంటాం. ఇక కుక్క కాటు వేస్తే డాక్టర్ దగ్గరకు పరిగెత్తి ఇంజెక్షన్లు చేయించుకుంటాం. అదే మనిషి కుక్కను కరిచేస్తే..?, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. కాగా కుక్కల్లో రాజ శునకం అల్సేషన్ డాగ్ ను 80ఏళ్ళ ఒక బామ్మ కసితీరా కరిచేసింది. ఇక వివరాలలోకి వెళితే బ్రిటన్ డెవోన్ ప్రాంతంలోని ఇపిల్ పెన్ లో జూన్ హట్టన్ అనే 80ఏళ్ళ బామ్మ మిల్లీ అనే ఒక బుజ్జి కుక్కపిల్లను పెంచుకుంటోంది. అయితే ఒకరోజు సాయంత్రం బామ్మ మిల్లీని తీసుకుని వీధిలోకి వ్యాహ్యాళికని వెళ్ళింది.

ఇంతలో ఎక్కడి నుండో ఒక అల్సేషన్ డాగ్ వచ్చి బుజ్జి మిల్లీ మెడను బలంగా కరిచి పట్టుకుని తన పదునైన పళ్ళతో గాయపరిచింది. ఇక ఈ అకస్మాత్ పరిణామానికి ఏమి చెయ్యాలో తోచని బామ్మ తన కుక్కపిల్లను రక్షించుకునేందుకు చటుక్కున ఆల్సేషన్ పైకి లంఘించి దానిని బలంగా కొరికింది. ఇంతలో ఆ పెద్ద కుక్క యజమాని వచ్చి తన పెంపుడు శునకాన్ని పట్టుకుని జూన్ హట్టన్ కు క్షమాపణ చెప్పాడు. అయితే అప్పటికే పెద్ద కుక్క చేసిన గాయానికి బుజ్జి కుక్కపిల్ల మిల్లీ ప్రాణాలు వదిలేసింది. ఇక దీనిపై హట్టన్ మాట్లాడుతూ తన కుక్కపై దాడి జరిగిన క్షణంలో ఏం చెయ్యాలో పాలుపోక పెద్దకుక్కను కరిచేశానని, ఆ క్షణం తన చేతిలో కత్తి ఉంటే కసితీరా ఆ కుక్కను పొడిచేసే దాన్నని ఆవేశంగా చెప్పుకొచ్చింది. మరి ఇదంతా చూస్తుంటే ఏమైనా బామ్మగారికి ధైర్యం, కోపం, కసి అన్నీ కాస్త ఎక్కువేనని అనిపిస్తోంది కదూ..!