గుట్టలుగా నోట్ల కట్టలు తెచ్చింది!

Thursday, April 23rd, 2015, 10:15:35 AM IST


సహజంగా ఏదైనా కొనాలంటే మనం బ్యాంకు కార్డును కాని, లేదా సాధ్యమైనంత వరకు ఇతరులు గుర్తించలేని విధంగా కొంత నగదును గాని మనతో తీసుకెళతాం. అయితే ఇక్కడ ఒక మహిళ మాత్రం బీఎండబ్ల్యూ కారు కొనేందుకు షాపుకు గుట్టలుగా తన వెంట నోట్ల కట్టలను తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే చైనాలోని జాంగ్ జూ పట్టణంలో ఒక మహిళ బీఎండబ్ల్యూ కారు కొనేందుకు షోరూంకు వచ్చింది. అలాగే కారు కోసం డబ్బులు చెల్లించడానికి ఆమె తన వెంట 1,20,700 యెన్ల నోట్లు తెచ్చింది. అయితే చైనాలో యెన్ నోట్లు అంటే మన దేశంలో రూపాయి నోట్లు కింద లెక్క అనమాట.

దీనితో షాక్ కు గురైన దుకాణం యజమాని తన సిబ్బందితో ఆ నోట్ల కట్టలను లెక్కించడం మొదలు పెట్టించాడు. ఇక ఉదయం నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు ఆ లెక్కింపు పూర్తికాలేదట. అటుపై ఇన్ని నోట్లు ఎందుకు తెచ్చారని అడిగిన సిబ్బందితో సదరు మహిళ తాను ఒక చిన్న హోటల్ నడుపుతున్నానని అక్కడ వినియోగదారులు ఇచ్చిన నోట్లను ఇలా భద్రపరిచానని, వాటిని లెక్కపెట్టే తీరిక లేక కారు కొనేందుకు నేరుగా తెచ్చానని సెలవిచ్చిందట. ఇక షోరూం యజమాని నోట్ల గుట్టలకు ఫోటో తీసి సోషల్ సైట్లలో పెట్టడంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.