రివ్యూ రాజా తీన్‌మార్ : అభినేత్రి – భయపెట్టిందీ అంతంతే.. నవ్వించిందీ అంతంతే..!

Saturday, October 8th, 2016, 01:30:06 PM IST


తెరపై కనిపించిన వారు : తమన్నా, ప్రభుదేవా, సోనూసూధ్
కెప్టెన్ ఆఫ్ ‘అభినేత్రి’ : ఏ.ఎల్.విజయ్

మూలకథ :

కృష్ణ (ప్రభుదేవా)కి ఈతరం స్టైలిష్ అమ్మాయిని చేసుకోవాలన్నది కల. అయితే అతడికి కొన్ని అనుకోని పరిస్థితుల్లో దేవి (తమన్నా)తో వివాహం జరుగుతుంది. కృష్ణకి పల్లెటూరి అమ్మాయి అయిన దేవీ అంటే నచ్చదు. కాగా ఇదే సమయంలో ఆమెలోకి ఓ దయ్యం దూరడంతో కథంతా మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులేంటీ? కథ చివరకు ఎక్కడకు చేరిందన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. కామెడీనే సినిమాకు హైలైట్. ముఖ్యంగా హర్రర్ కామెడీల్లో కామెడీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికర అంశం. ఇందులో భార్యకు దయ్యం పడితే భర్త పరిస్థితి ఎలా ఉంటుందీ అన్న అంశంతో మంచి కామెడీ పండించారు.

2. ప్రభుదేవా చాలాకాలం తర్వాత ఒక పూర్తి స్థాయి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఒకటి, రెండు పాటల్లో ఆయన డ్యాన్సులకు విజిల్స్ వేస్తూ పోవచ్చు.

3. తమన్నా స్టార్ స్టేటస్ ఎంతటిదో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోనూ ఆమె తన స్టార్‌డమ్‌కి తగ్గ రోల్‌లో అదరగొట్టింది. తమన్నా యాక్టింగ్, డ్యాన్స్‌లకు కూడా విజిల్స్ వేస్తూ పోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. హర్రర్ అన్న మాటే లేకపోవడం ఢమ్మాల్ పాయింటే. అభినేత్రి అన్న టైటిల్ చూసి, హర్రర్ సినిమా అన్న ప్రచారం చూసొచ్చిన వారికి నిరాశ తప్పదు..!

2. సినిమాలో ఎమోషన్ ఎక్కడా ఉన్నట్టు కనిపించదు. అక్కడక్కడా కొన్ని చోట్ల ఎమోషన్ కనిపించినా, కామెడీ ఎక్కువ చేసి అసలు ఎమోషన్‌ను పూర్తిగా దెబ్బతీశారు.

3. సెకండాఫ్ అంతా ఇట్టే ఊహించగలిగేలా ఉండడం కూడా ఢమ్మాలే! అంతా మనం అనుకునే సన్నివేశాలతోనే సాగుతూ ఈ పార్ట్ చాలాసార్లు బోరింగ్‌గా తోచింది.

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> దయ్యం పట్టిన తర్వాత మనకి ఎక్కడైనా భయపెడతారేమో అనుకుంటే, ఇక్కడ సినిమా ఏమో ఎటెటో వెళ్ళిపోతుంది. అసలు మనం హర్రర్ సినిమాకే వచ్చామా అన్న ఆలోచన రావడం కూడా ఆ సిత్రమే!

–> కామెడీ బాగుందని ముందే చెప్పినా, అక్కడక్కడా ఆ కామెడీ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంది. నిజానికి భయపెట్టాల్సిన సమయంలో అక్కడ కామెడీ సన్నివేశాలు రెండు, మూడు సార్లు రావడమంటే సిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : భయపెడతారనుకుంటే, వీళ్ళేంట్రా కామెడీ చేశారూ..?
మిస్టర్ బీ : ఆ కామెడీ కూడా అంతంతే ఉంది కదరా బాబూ..!!
మిస్టర్ ఏ : (సైలెంట్)