మోడీ భాయ్.. మీరు సూపర్!

Thursday, October 2nd, 2014, 04:59:53 PM IST


భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, అగ్రనేత అయిన ఎల్ కే అద్వానీ అహ్మదాబాద్ లో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ
పనితీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే ప్రధానితో పాటు ఇతర కేంద్రమంత్రులు కూడా తమ బాధ్యతలను భేషుగ్గా నిర్వర్తిస్తున్నారని అద్వానీ కితాబిచ్చారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ‘నరేంద్ర భాయ్ ప్రధానిగా గొప్ప బాధ్యతతో పని చేస్తున్నారని గర్వంగా చెబుతున్నా’ అని పేర్కొన్నారు. అలాగే ప్రధాని బాధ్యత దేశంలో పాలన సజావుగా సాగించడమొక్కటే కాదని ఇతర దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం కూడా ముఖ్యమేనని అద్వానీ అభిప్రాయపడ్డారు. ఇక ఎన్నికలలో ప్రజల మనసు గెలిచిన మోడీ ఇప్పుడు ప్రపంచం మనసు గెలుచుకున్నారని పొగిడారు. అయితే భారతదేశ చరిత్రలో వాజ్ పేయ్ ని మించిన ప్రధాని లేరని, ఆయన పొందిన గౌరవం మరెవరూ పొందలేదని అద్వానీ పేర్కొన్నారు.