క్షమాపణ చెప్పిన అలబామా గవర్నర్!

Wednesday, February 18th, 2015, 02:06:52 PM IST


అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన కొడుకు వద్దకు వెళ్ళిన సురేష్ భాయ్ పటేల్ అనే భారతీయుడి పట్ల అక్కడి పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన తీరు సంగతి తెలిసిందే. కాగా వాకింగ్ కని బయలుదేరిన సురేష్ భాయ్ కి ఇంగ్లీష్ రాక అమెరికా పోలీసు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో, వృద్ధుడని కూడా చూడకుండా పెడరెక్కలు విరిచి నేలపై పడేసిన వైనం భారతీయులను ఆవేదనకు గురిచేసింది. అయితే ఈ పోలీస్ దుశ్చర్యతో తీవ్రంగా గాయపడిన సురేష్ భాయ్ ఇప్పుడు పాక్షిక పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సురేష్ భాయ్ కు అలబామా రాష్ట్ర గవర్నర్ రాబర్ట్ బెంట్లే భేషరతుగా క్షమాపణ తెలిపారు. అలాగే జరిగిన సంఘటన దురదృష్టకరమని, దీనిపై ఎఫ్ బీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించిందని అలబామా గవర్నర్ పేర్కొన్నారు. ఇక ఈ విషాదకర సంఘటనపై తన క్షమాపణను అంగీకరించాల్సిందిగా ఇండియన్ కాన్సులేట్ జనరల్ కు రాసిన లేఖలో అలబామా గవర్నర్ విన్నవించారు. కాగా సురేష్ భాయ్ పటేల్ పై దాడికి పాల్పడిన పోలీసును వెంటనే అరెస్ట్ చేసిన స్సంగతి తెలిసిందే.