తెలంగాణలో పదో తరగతి విద్యార్థులంతా పాస్.. జీవో జారీ..!

Tuesday, May 11th, 2021, 10:33:51 PM IST

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులందరిని పాస్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. పరీక్ష ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, గత సంవత్సరం మాదిరిగానే ఫార్మెటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులందరికి గ్రేడ్లు ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో త్వరలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది.

అయితే ప్రభుత్వం ప్రకటించే ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులకు పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసే వెసలుబాటు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా ప్రమోట్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం, సెకండ్ ఇయర్ పరీక్షలపై జూన్‌ రెండో వారంలో సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.