వింతలు విడ్డూరాలు వింత బంధాలు తెరపైకొస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం.. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచ స్వరూపమే మారిపోతోంది. వింత పోకడలతో ప్రపంచం కొత్త దారిలో పయనిస్తోంది. ప్రపంచ గమనానికి తగ్గట్టే కాలం మారుతోంది. మనుషులూ వారి సంప్రదాయాలు మారుతున్నాయి. మారుతున్న కాలంతో మనుసుల్లో కొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వింతే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. వివాహ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తూ వింత బంధం ఒకటి మానవాళిని ఆశ్చర్యానికి లోను చేస్తోంది. పాతొక రోత.. కొత్తొక వింత అన్నట్టుగా వివాహ వ్యవస్థ డెఫినెషన్ నే మార్చేస్తోంది.
తాజాగా అమెరికాలోని న్యూ జెర్సీ నగరంలో ఇద్దరు స్వలింగ సంపర్కులు (గే)లు సంప్రదాయ బద్ధంగా రెగ్యులర్ పెళ్లి తరహాలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా వివాహం జరగడం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హైటెక్ నగరంగా పిలవబడే అమెరికాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఒకింత ఆశ్చర్యమే. అమెరికాలో గత కొన్నేళ్లుగా నివాసం వుంటున్న అమిత్ షా, ఆదిత్య మాదిరాజు గత కొంత కాలంగా ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఫైనల్గా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు వివరించారు. ముందు కొంత కంగారుపడినా ఆ తరువాత తేరుకున్న కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఆమోదముద్ర వేశారు.
దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి రెడీ అయిపోయారు. సాంప్రదాయ బద్ధంగా తమ వివాహ వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతకు ముందు ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేసిన అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ఆ వీడియోని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో వీరి పెళ్లి వార్త వైరల్గా మారింది. వీరిద్దరి వెడ్డింగ్ అమెరికా నగరంలోని న్యూ జెర్సీలో అత్యంత స్టైలిష్గా సంప్రదాయ పద్దతిలో జరగడంతో అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ పెళ్లి కోసం ఇద్దరు ప్రత్యేకంగా కుర్తాలని డిజైన్ చేయించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వింత సంప్రదాయానికి తెరలేపిన అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ల వివాహం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.