అనుష్కకు బిగ్ బీ సరదా వార్నింగ్!

Tuesday, July 28th, 2015, 04:04:34 PM IST


బాలీవుడ్ అందాల నటి అనుష్కా శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీలు జగమెరిగిన ప్రేమ పక్షులు అన్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ అభిమానులు అతనిని అనుష్క పేరుతో, అనుష్క అభిమానులు ఆమెను కోహ్లీ పేరుతో సరదాగా ఆటపట్టించడం మామూలే. అయితే ఈ సరదా హద్దులు దాటితే ఎవరికైనా కోపం వస్తుంది. అదే అనుష్కా శర్మ విషయంలో జరిగింది. ఇక వివరాలోకి వెళితే అనుష్క శర్మ ట్విట్టర్ లో ఆమె ఫాలోయర్స్ ఇటీవల కాలంలో అడ్డమైన ప్రశ్నలతో విసిగిస్తున్నారట.

కాగా అనుష్కను సదరు ఫాలోయర్స్ ‘నువ్వంటే నాకిష్టం.. పెళ్ళాడాలనుకుంటున్నా’, ‘ఇంతకీ విరాట్ తో నీ లవ్ ఎంతవరకు వచ్చింది?’, ‘రణవీర్ సింగ్ ని వదిలేసినట్లే విరాట్ కు టాటా చెప్పి, తర్వాత నాకు ఐ లవ్యు చెప్తావా?’ అంటూ అడ్డదిడ్డమైన, అసందర్భమైన ప్రశ్నలతో విసిగిస్తున్నారట. దీనితో చిరాకు వచ్చిన అనుష్క ఇకపై అభ్యంతర వ్యాఖ్యలను పంపించిన వాళ్ళను బ్లాక్ చేస్తానని ట్వీట్ చేసింది. ఇక దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘నన్ను బ్లాక్ చెయ్యకు.. ఊరుకోను’ అంటూ సరదాగా అనుష్కకు వార్నింగ్ ఇచ్చారు. అటుపై దీనికి స్పందించిన అనుష్క ‘అలాంటి పనిని జీవితంలో చెయ్యను సర్’ అంటూ జవాబు ఇచ్చింది.