ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని డిసెంబర్ 15 నాటికి నష్టపరిహారంపై అంచనాలు పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాథమికంగా 30 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 అందించాలని సూచించారు.
ఇక ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంతేకాదు 3.144 శాతం డీఏ పెంపునకు కూడా కేబినెట్ ఆమోదించిందని, కరోనా సమయంలో మార్చి నెల వేతనాలను డిసెంబర్లో, ఏప్రిల్ వేతనాలను జనవరిలో అందిస్తామని తెలిపారు. అయితే డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపకాలు చేపడతామని అన్నారు. డిసెంబర్ 15 నుంచి వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 21న సమగ్ర భూసర్వేను కూడా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. కడప జిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ క్లస్టర్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయించింది.