కరోనా నియంత్రణపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

Tuesday, April 20th, 2021, 02:00:36 AM IST

ఏపీలో కరోనా ఉదృత్తి రోజు రోజుకు పెరుగుతుండడంతో నేడు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కరోనా నియంత్రణపై పలు ఆదేశాలు జారీ చేశారు. సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి అని, కన్వెన్షన్‌ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలని, థియేటర్లలో ప్రతి 2 సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీ ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.

ఇకపోతే ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారికి ఫైన్‌లు విధించాలని సీఎం జగన్ అన్నారు. కోవిడ్‌ సమస్యలన్నింటికీ 104 నంబరు పరిష్కారంగా ఉండాలని, దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. ఇక ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండాలని, అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్‌ సరఫరా ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.