ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రయాణిస్తున్న కారును ఆయన కాన్వాయ్‌లోని మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
అయితే డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎస్కార్ట్‌లోని ఓ వాహనం ఒక్కసారిగా ఆగడంతో వెనకాల వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనలో నారాయణస్వామికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన కాసేపటికి అదే కారులో నారాయణస్వామి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.