స్పీడ్ పెంచిన ఏపీ సర్కార్

Wednesday, October 8th, 2014, 05:17:14 PM IST

chandhrababu-ap-govt
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. పథకాలు, కార్యక్రమాలు, విజన్స్, మిషన్స్.. ఇలా అన్ని రంగాల్లో వేగం పెంచింది. ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం నిర్ధేశించుకున్న 7 మిషన్లు ఒక్కటిగా ప్రారంభిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఇందులో భాగంగా పట్టణాభివృద్ధి మిషన్ కూడా ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మిషన్ ద్వారా 3 మెగా సిటీలు, 10 స్మార్ట్ సిటీలను అభివృద్ది చేయటం… జీవన ప్రమాణస్థాయి పెంచాలని లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. వలసల ఆధారంగా పట్టణ ప్రణాళికలు రూపొందించుకొని దాని ద్వార ఆర్ధిక వనరులు సమీకరించుకోవటం, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటివి ఈ మిషన్ ద్వారా చేపట్టనున్నారు. అంతర్గతంగా సంస్కరణలు తీసుకురావటం ద్వారా పట్టణ స్థానిక సంస్థల్లో సమూల మార్పులు తేవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.

20న విజయవాడలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రాథమిక రంగ మిషన్ ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులు మీదుగా ప్రారంభించినట్టే అర్బన్ మిషన్ ను పేరొందిన నిపుణుడితో ప్రారంభించాల‌ని ఆలోచిస్తోన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తూర్పు గోదావరి, అనంతపురం,ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు.

10 నుంచి మళ్లీ జన్మభూమి కార్యక్రమాల్లో బాబు బిజీ బిజీ గా గడపనున్నారు. 10న శ్రీకాకుళం, 11 విజయనగరం, 13 కర్నూలు, 14 కడప, 16వ తేదీ నెల్లూరులో పర్యటిస్తారు. 16వ తేదీ నెల్లూరులోనే బస చేసి, 17న చిత్తూరు, 18 విశాఖ, 19వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. 19వ తేదీ రాత్రి విజయవాడ చేరుకుంటారు. 20, 21 వ తేదీల్లో విజయవాడలోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22 వ తేదీ జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహణను సమీక్షించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది.