ఆ విధమైన డైలాగులే పవన్ స్క్రిప్ట్ చదువుతున్నాడనడానికి నిదర్శనం – కొడాలి నాని

Monday, April 5th, 2021, 07:31:05 AM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ పై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన సేన అదినేత పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన డైలాగులు చదువుతున్నారు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి అవగాహన రాహిత్యం రోజురోజుకీ పెరుగుతోంది అని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ లో డైలాగులు చెప్పడం అలవాటు అయిపోయిన ఆయన వేదిక పైకి వచ్చినప్పుడు వాటిని చదివే నేపథ్యంలో వాస్తవాలు మర్చిపోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి లో జరిగితే, ఆ ఏడాది మే వరకూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నారు అని కొడాలి నాని గుర్తు చేశారు. అయితే అప్పటి హత్యకు సంబందించి పూర్తి ఆధారాలను అప్పటి ప్రభుత్వమే సేకరిస్తుందన్న విషయం పవన్ కు తెలియక పోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును తేల్చడం లేదు అని పవన్ అనడం చూస్తే ఆయనకు ఏ మాత్రం అవగాహన ఉందో సామాన్యుడి కి కూడా అర్థమవుతుంది అని అన్నారు. అంతేకాక ఈ విధమైన డైలాగులే పవన్ కళ్యాణ్ స్క్రిప్టు చదువుతున్నాడు అనడానికి నిదర్శనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల కి జన సేన నాయకులు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.