ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!

Thursday, April 1st, 2021, 11:08:59 PM IST


ఏపీలో మరో ఎన్నికలకు నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌గా నేడు ప్రమాణస్వీకారం చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 8వ తేదిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, 10వ తేదిన ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే అవసరమైన చోట ఈ నెల 9న రిపోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 513 జడ్పీటీసీ, 7,320 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, జడ్పీటీసీ బరిలో 2092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 126 జడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదిన హైకోర్ట్ తీర్పు రానుండగా, పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగుతాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది.