రజనీ వియ్యంకుడికి అరెస్ట్ వారెంట్!

Tuesday, February 3rd, 2015, 01:05:18 PM IST


తమిళ సూపర్ స్టార్ వియ్యంకుడు, మరో ప్రముఖ నటుడు ధనుష్ తండ్రి, స్వతహాగా దర్శకుడు అయిన కస్తూరి రాజాకు చెన్నై జార్జి టౌన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. వివరాలలోకి వెళితే చెన్నై షావుకారుపేటకు చెందిన ఫైనాన్షియర్ ముకున్ చంద్ బోద్రా వద్ద 2012 సంవత్సరంలో 65లక్షల రూపాయలను దర్శకుడు కస్తూరి రాజా అప్పుగా తీసుకున్నారు. అనంతరం కస్తూరి రాజా అప్పును చెక్కుల రూపంలో చెల్లించగా ఆ చెక్ లు బ్యాంకులో బౌన్సు కావడంతో అతనిపై కేసును నమోదు చేసారు.

కాగా ఆ చెక్ బౌన్సు కేసు జార్జిటౌన్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం న్యాయమూర్తి కోదండ రాజ్ సమక్షంలో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణకు దర్శకుడు కస్తూరి రాజా గాని, అతని తరపున గాని ఎవరూ హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కస్తూరి రాజాకు అరెస్ట్ వారెంటును జారీ చేశారు. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 13న జరగనుంది.