ఆ సమయంలో చనిపోయినట్లు నటించి బ్రతికిపోయాను అంటున్న యువతీ!

Sunday, February 25th, 2018, 10:50:18 AM IST

ఇటీవల చెన్నైలో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన టెకీ లావణ్య దాడి సమయంలో జరిగిన ఉదంతానికి సంబంధించి పోలీస్ లు లావణ్య వద్దనుండి వాంగ్మూలాన్ని ఒక వీడియో రూపంలో సేకరించారు. హృదయ విదారకమయినా ఆ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న లావణ్య ఈనెల 12వ తేదీన యధావిధిగా తన కార్యాలయ విధులను ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతుండగా చెన్నై శివారు పేరుంబాకమ్లో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారని, వారిలో ఒకడు నా చేతికి ఉన్న బంగారు బ్రాస్‌లెట్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాదన్నారు.

నేనే ఇస్తాను వదిలిపెట్టండి అన్నా వినిపించుకోలేదు. చేతికి ఎంతో టైట్‌గా ఉన్న బ్రాస్‌లైట్‌ను బలవంతంగా లాగడంతో బాధతో విలవిలలాడిపోయాను. నన్ను ఏమీ చేయకండి అన్నాకాని వాళ్ళు వినిపించుకోలేదని, చివరికి వారితో నేను వాగ్వాదానికి దిగడంతో వెనక నుంచి ఒకడు ఇనుప రాడ్డుతో నా తలపై బలంగా కొట్టాదన్నారు. ఆ క్షణంలో తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో బైక్‌ నుంచి ఒక్కసారిగా కిందపడి పోయాను. ఆపై వెంటనే తన తల, చేతులు, గుండెపై రాడ్డుతో, చేతులతో పిడిగుద్దులు గుద్దారు అన్నారు. మీక్కావాల్సిన వస్తువులన్నీ తీసుకోండి కానీ నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి అని ప్రాధేయపడినా పట్టించుకోకుండా ఆ దుండగులు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని వారిగా వ్యవహరించారు.

వారి బారి నుండి తప్పించుకోవడానికి చివరకు చనిపోయినట్లు నటించే సరికి నిజంగా నేను చనిపోయాననుకుని వదిలేసి వెళ్లిపోయారని, లేకపోతే నిజంగానే చంపేసేవారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం చాలా సేపు రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడాను. ఎవరూ సహాయానికి రాని పరిస్థితుల్లో మానసిక స్థైర్యాన్ని గుండెల్లో నింపుకున్నా. రక్తం కారుతున్న స్థితిలో నేను మనోధైర్యాన్ని కూడగట్టుకుని లేచి నిల్చొని ఎదురుగా కొత్తగా కడుతున్న నిర్మాణంలోకి నడిచి వెళ్లాను. కొంచెంసేపయ్యాక మళ్లి నిలదొక్కుకుని జనసంచారం ఉన్న చోటకు వెళితే సహాయం లభిస్తుందని బయల్దేరాను.

మా నాన్నకు మేము ఇద్దరం కూతుళ్ళం. అయితే ఇప్పటికే మా నాన్న ఒక కూతుర్ని పోగొట్టుకున్నారు. నేను కూడా లేకపోతే ఆయన బ్రతకలేరని, ఒక్కసారిగా ధైర్యంతో ప్రాణం ఉగ్గబట్టుకుని నడవసాగానన్నారు. సుమారు రెండు గంటల తర్వాత ఒక వాహనంలో వెళుతున్న వ్యక్తుల ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నా కేసు విషయంలో నా నుండి ఏ ఆధారాలు సేకరించకుండా దుండగులను వెంటనే పట్టుకున్న తమిళనాడు పోలీసులు ప్రశంసనీయులు. ముఖ్యంగా నేను కోలుకునేందుకు రేయింబవళ్లు పాటుపడిన పళ్లికరణై ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌కు నేనెప్పటికీ రుణపడి వుంటాను అన్నారు.

నిజానికి తమిళనాడు ప్రజలు నా కోసం చేసిన ప్రార్థనలు, నా తల్లి తండ్రుల ఆశీర్వాదాలు నన్ను బ్రతికించాయి. పోలీసులు వచ్చి నిందితులను ఫొటోలు చూపించి గుర్తించమని కోరారు. అయితే నేను వారి ముఖాలను చూసేందుకు ఇష్టపడలేదు.నా జీవితంలో వాళ్లను మరోసారి చూడకూడదని, జ్ఞాపకంలోకి కూడా రాకూడదని నిర్ణయించుకున్నా. దారిదోపిడీకి పాల్పడే నేరస్థులను పట్టుకుని దండించే పోలీసులు వారి ఫొటోలను ప్రజల్లో బహిరంగంగా ప్రకటించాలి, అటువంటి వారికి శిక్షలు మరింత కఠినంగా అమలు చేయాలి అన్నారు….