రివ్యూ రాజా తీన్‌మార్ : బాహుబలి 2 – తెలుగువారు గర్వించదగ్గ సినిమా !

Friday, April 28th, 2017, 02:42:08 PM IST


తెరపై కనిపించిన వారు: ప్రభాస్, రానా, అనుష్క, రమ్య కృష్ణ, సత్యరాజ్, తమన్నా
కెప్టెన్ ఆఫ్ ‘బాహుబలి 2 : ఎస్. ఎస్ రాజమౌళి

మూల కథ :
అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి(రమ్య కృష్ణ) మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించిన తర్వాత రాజు కాబోతున్న బాహుబలి దేశయాటనకు బయలుదేరి కుంతలదేశం చేరుకొని ఆ దేశపు యువరాణి అయిన దేవసేనను ప్రేమిస్తాడు. కానీ బాహుబలి రాజు కావడం, దేవసేనను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేని భల్లలాదేవుడు తన కుట్రతో శివగామే బాహుబలిని రాజుగా కాకుండా ఆపేలా చేస్తాడు.

ఇక కుట్రతో రాజైన భల్లాలుడు బాహుబలిని, అతని భార్య దేవసేనను ఎలాంటి కష్టాలు పెట్టాడు ? అసలు శివగామి బాహుబలిని రాజు కాకుండా ఎందుకు ఆపింది ? బాహుబలిని కట్టప్పే ఎందుకు చంపాల్సి వచ్చింది ? తన తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకున్న మహేంద్ర బాహుబలి భల్లలాదేవుడ్ని ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి భల్లాలుడు ఎలా మరణించాడు ? అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :

ఈ సినిమాలో విజిల్ వేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో..

–> సినిమా కథను అద్భుతంగా తయారు చేసుకోవడమేగాక దానికి తగిన మంచి కథనాన్ని రూపొందించుకోని అంతే బాగా దాన్ని తెరపై ఆవిష్కరించిన రాజమౌళి పనితీరుకు అతి పెద్ద విజిల్ వేయాలి. ఎందుకంటే తార స్థాయి అంచనాలతో థియేటర్లోకి వచ్చే ప్రేక్షకుడ్ని సంతృప్తిపరచడమంటే మాటలు కాదు. ఆ పనిని రాజమౌళి 99 శాతం విజయవంతంగా చేశాడు .

–> సినిమాలో కనిపించే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా ప్రభాస్ ను ఎలివేట్ చేసే సన్నివేశాల్లో, హంస నావ వంటి పాటల్లో, మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూపే సందర్భాల్లో, క్లైమాక్స్ ఫైటింగ్లో విజువల్ ఎఫెక్ట్స్ రఫ్ఫాడించాయి. అద్భుత దృశ్య కావ్యాన్ని కళ్లముందుంచాయి. కనుక విఎఫ్ఎక్స్ టీమ్ కు కూడా పెద్ద విజిల్ వేయాలి.

–> ఇక అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది. ఆ పాత్ర కనిపించే ప్రతి సీన్ ఎంతో హుందాగా ఉంది. అలాగే యువరాణి దేవసేన అందం, ఆత్మగౌరవంతో కూడిన అహంకారం చాలా బాగున్నాయి. రాజమాతగా శివగామిదేవి రాజసం అసామాన్యం, క్రూరమైన ప్రతి నాయకుడిగా రానా నటన, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. కట్టప్పగా సత్యరాజ్ గొప్పగా నటించారు. ఎక్కడ నిరుత్సాహపరచలేదు. కనుక వీరందరికీ కలిపి ఒక విజిల్ వేయవచ్చు.

–> అలాగే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లోని ఎమోషనల్ డ్రామా సినిమాకే హైలేట్ గా నిలిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆసక్తిగా ఉన్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

ఈ గొప్ప సినిమాలో తప్పులు ఏమంత కనిపించలేదు.. కానీ లోతుగా చూస్తే

–> క్లైమాక్స్ రానా -ప్రభాస్ ల ఫైట్ మినహా మిగతా వార్ ఎపిసోడ్ చాలా వరకు పేలవంగానే ఉంది. మొదటి పార్ట్ లో ఉన్నంత గొప్ప స్థాయిలో అయితే లేదు. అలాగే తమన్నా పాత్రకు కాస్తంత ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–>తీసింది రాజమౌళి కనుక ఆశ్చర్యపోవాల్సిన పోరపాట్లు ఎక్కడా దొరకలేదు.

చివరగా సినిమా చూసి బయటికొస్తున్న ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : గర్వంగా ఉంది.
మిస్టర్ ఏ: సినిమా ఎలా ఉందంటే గర్వంగా ఉందంటావేంటి !
మిస్టర్ బి: అదేరా సినిమా చూసి తెలుగువాడినని గర్విస్తున్నాను అంటున్నా.
మిస్టర్ ఏ: అంటే సినిమా అద్బుతమనేగా అర్థం.
మిస్టర్ బి: అంతేగా మరి.