బాబును తప్పుపట్టిన జేసీ

Monday, November 10th, 2014, 01:53:50 PM IST


అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే కొన్ని సమస్యలను చంద్రబాబే కొని తెచ్చుకుంటున్నారని జేసీ విమర్శించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్నన్ని కష్టాలు ఎవరికీ లేవని, రుణమాఫీ చేసిన తర్వాతే ఫించన్లు పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే లక్ష రూపాయలు మాఫీ చేస్తే చాలని రైతులు ఆశిస్తున్నారని, రుణాల కోసం ప్రస్తుతం ఏ బ్యాంకు అధికారిపైనా వత్తిడి చెయ్యలేదని జేసీ తెలిపారు. ఇక రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారనేది రైతులకు అనవసరమని పేర్కొన్న జేసీ దివాకర్ రెడ్డి, ఏ పార్టీ లోనైనా నేతల మధ్య విబేధాలు సహజమని స్పష్టం చేశారు.