కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తుంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, April 1st, 2021, 05:50:28 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్య వర్గ మొదటి సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తుందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ లు గుర్తుకు వస్తాయని, ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్‌పీఎస్‌సీలోనే ఖాళీలున్నాయని ఎద్దేవా చేశారు. యువమోర్చా చేపట్టే ఉద్యమాలతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని, పైసలు వెదజల్లి టీఆర్‌ఎస్‌ గెలిచిందని బండి సంజయ్ అన్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కృషి చేయాలని, ఆ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో మూర్ఖత్వపు, అవినీతి, రజాకార్ పాలన కొనసాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.