కడప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి..!

Saturday, May 8th, 2021, 01:51:11 PM IST


ఏపీలో కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనుల్లో ఉన్న 10 మంది క్వారీ కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్లగ‌నికి పేలుడు పదార్థమైన జిలెటిన్‌స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ప్రమాద‌వ‌శాత్తు వాహ‌నంలో ఉన్న జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. ప్రస్తుతం క్వారీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు అందించిన నష్టపరిహారం మాదిరిగానే, క్వారీలో మృతి చెందినవారికి కూడా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.