జైల్లో ‘సరిగమ పదనీ’… !

Friday, May 15th, 2015, 03:47:01 PM IST


‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణి’ అన్నారు పెద్దలు. అంటే సంగీతం శిశువులను, పశువులను ఆఖరికి ప్రాణాలను తీసే విష సర్పాలను కూడా రంజింపజేస్తుంది అని అర్ధం. అయితే ఇది అక్షరాల నిజమని నిరూపించారు బీహార్ రాష్ట్రంలోని భగల్ పూర్ సెంట్రల్ జైలులోని ఖైదీలు. ఇక వివరాలలోకి వెళితే ఖైదీల కఠిన హృదయాలను మార్చడానికి అక్కడి జైలు సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే భయంకరమైన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంగీత పాఠాలను చెప్పించడం.

ఇక దీనిపై జైలు సూపరిండెంట్ నీరజ్ ఝా మాట్లాడుతూ తమ జైలులో నెల రోజుల నుండి సంగీతంపై ఆశక్తి కలిగిన కొందరు ఖైదీలకు శిక్షణనిప్పించామని, ప్రస్తుతం వారు హార్మోనియం, డ్రమ్స్, సింథసైజర్ వాడకంలో ప్రావీణ్యం సంపాదించారని వివరించారు. అలాగే అదేం చిత్రమో కాని అంతకు ముందు కరుకుగా, కఠినంగా ఉండే ఖైదీలు కాస్తా సంగీత సాధన చెయ్యడంతోనే మృదువుగా మారిపోయారని నీరజ్ తెలిపారు. ఇక ఇది చాలా మంచి మార్పని, త్వరలోనే ఖైదీలందరూ సంగీత క్లాసులకు హాజరవుతారని, అప్పుడు తమ జైలు నందనవనంలా మారుతుందని ఆశిస్తున్నామని నీరజ్ ఝా ఆశాభావం వ్యక్తం చేశారు.