ఏపీ సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ.. మ్యాటరేంటంటే..!

Saturday, April 3rd, 2021, 03:03:50 AM IST


ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైద్య పరికరాల టెండర్లలో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. 2015లో రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఆఫ్శంఈడ్ఛ్ ద్వారా టెండర్లు పిలిచి, బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టేలీ మాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసిందని అన్నారు. అయితే కాంట్రాక్టుల్లో జరిగిన భారీ స్కామ్ పై సీఐడీ కేసు వేగంగా, నిష్పక్షపాతంగా విచారించి దోషులను న్యాయస్థానం ముందు హాజర్‌పర్చాలని అన్నారు.

అయితే నిబంధనలకు వ్యతిరేకంగా టెండరులో అవకతవకలు జరిగాయని ఏడాదికి రూ.460 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని ఆరోపించారు. అయితే రూ.300 కోట్లు విలువ చేసే ఉపకరణాల విలువను రూ.500 కోట్లుగా చూపించినట్లు సమాచారం ఉందని ఈ అవినీతిలో రూ.200 కోట్ల మేర చేతులు మారాయని సోము వీర్రాజు అన్నారు. సీఐడీ ఈ కేసు విచారణను వేగంగా పూర్తిచేసి ఆసలైన దోషులను శిక్షించాలని అన్నారు.