హీరోకు ఏపీ మంత్రి వార్నింగ్!

Tuesday, April 14th, 2015, 05:45:47 PM IST


ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు, భాజపా నేత శివాజీ ఇటీవల రాజకీయ అంశాలలో ఉత్సుకతను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఈ మధ్య కాలంలో పోరాటం సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో శివాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కాగా ఇదే నేపధ్యంలో అసలు శివాజీ భాజపా నేతే కాదంటూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు శివాజీ తీరుపై వ్యతిరేకతను వ్యక్తం చేసి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘శివాజీ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు… సోము వీర్రాజు ఎవరని ప్రశ్నిస్తున్నావు..పార్టీలో కీలక నేతైన వీర్రాజును ప్రశ్నించడం సబబు కాదు.. ఇప్పటికైనా వైఖరి మార్చుకో..లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఇక ఇవన్ని చూస్తుంటే శివాజీ ఇతర పార్టీ నేతలతో కాకుండా సొంత పక్షంతోనే గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. మరి ఇదే తంతు గనుక కొనసాగితే ఆ పార్టీలో హీరోగారి స్థానం అనుమానాస్పదమే.