మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి.. బుద్ధా వెంకన్న డిమాండ్..!

Wednesday, February 24th, 2021, 06:31:30 PM IST

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో జరిగిన ఏసీబీ సోదాల్లో అసలు దొంగ వెల్లంపల్లిని వదిలేశారని, కొంతమంది చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం అవినీతి తిమింగలాన్ని వదిలేసిందని ఆరోపణలు చేశారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉండి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనంత దోపిడీకి వెల్లంపల్లి పాల్పడ్డారని బుద్ధా వెంకన్న అన్నారు.

అంతేకాదు దుర్గుగుడిలో మాయమైన చీరలు వెల్లంపల్లి ఇంటిలో, ఆయన దుకాణంలో ఉంటాయని, దేవాలయంలోని స్టోర్‌లోని సరుకులు కూడా ఆయన ఇంటికే చేరుతాయని అన్నారు. అమ్మవారికి కానుకల రూపంలో కోటి రూపాయలు వస్తే అందులో 50 లక్షలు వెల్లంపల్లి కాజేస్తాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా తనిఖీలు జరిపితే వెల్లంపల్లి అవినీతి బాగోతం బయటపడుతుందని, దేవుడి సొమ్ము రూపాయి కూడా తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తన బిడ్డలపై ప్రమాణం చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పగలడా అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దేవాదాయశాఖ మంత్రిగా ఈ అవినీతికి బాధ్యత వహించి వెల్లంపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.