విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు.. కేంద్రం కీలక ప్రకటన..!

Monday, March 8th, 2021, 07:02:42 PM IST

ఆంద్రుల హక్కు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి స్పందించింది.

అయితే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఎంపీ సత్యనారాయణ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశ్నించగా దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అందరికి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి సంబంధం లేదని, స్టీల్ ప్లాంట్‌లో 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. అయితే మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని, ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని అవసరమైనప్పుడు తమకు మద్ధతు ఇవ్వాలని కోరినట్టు కూడా ఆమె తెలిపారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తధ్యమనిపిస్తుంది.