కరోనా కష్ట కాలంలో పేదలకు ఊరట.. కేంద్రం మరో కీలక నిర్ణయం..!

Friday, April 23rd, 2021, 05:55:53 PM IST

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపధ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఉచితంగా రేషన్ పంపిణీ చేసేందుకు సిద్దమయ్యింది. గతంలో లాక్‌డౌన్ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద రాబోయే రెండు నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించబోతుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.

ఈ నేపధ్యంలో మే, జూన్ నెలల్లో పేదలు ఉచితంగా రేషన్ పొందనున్నారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. దీంతో కేంద్రంపై అదనంగా మరో రూ.26,000 కోట్ల భారం పడనుంది. ఈ పథకం కింది పేదలు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అందించనున్నారు. అయితే గతేడాది నవంబర్ వరకు కేంద్రం ఇదే రకంగా పేదలకు రేషన్ అందించింది.