వ్యాక్సిన్ ప్రక్రియపై కేంద్రం మరో కీలక నిర్ణయం…!

Monday, April 19th, 2021, 11:35:07 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో విడత వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మే 1 నుంచే ఈ నిర్ణయం అమలు కాబోతుంది. దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిలో 50 శాతం వ్యాక్సిన్‌‌లను కేంద్ర ప్రభుత్వానికి, మరో 50 శాతం వ్యాక్సిన్‌‌ డోసులను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓపెన్ మార్కెట్‌కు కూడా సరఫరా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ మొదటి విడతలో భాగంగా మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా ఆ తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృత్తంగా మారడంతో 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.