టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను తగ్గిస్తాం – చంద్రబాబు

Wednesday, March 3rd, 2021, 01:11:05 AM IST


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని అన్నారు. కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని అన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా ధైర్యంగా పోరాడి టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

అయితే టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ తొలి సమావేశంలోనే తీర్మానిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వాటిని తప్పకుండా అడ్డుకుని తీరుతామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజల్, పెట్రోల్, వంట నూనెల ధరలు భారీగా పెరిగాయని, ఆస్తి పన్ను కూడా పెరిగితే ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చంద్రబాబు అన్నారు.