ఏపీలో మరో పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతోందా..?

Tuesday, February 2nd, 2016, 08:43:04 AM IST


ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా తమను బీసీల్లో చేర్చాలంటూ చేస్తున్న కాపు ఐక్య గర్జన తీవ్ర రూపం దాల్చింది. 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఇంత పెద్ద నిరసన తలెత్తడం ఇదే తొలిసారి. ఒకసారి విజయవాడ కాపు నేత వంగవీటి మోహన రంగా కాపునాడు నిర్వహించి పెద్ద సంచలనమే సృష్టించారు. ఆ తరువాత మళ్ళీ ఇదే పెద్ద సంఘటన.

ఏపీ, తెలంగాణాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాదాపు 23% మంది ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దత్తు ఉండాల్సిందే. నిన్నటి వరకూ రాష్ట్రంలో కాపుల తరపున చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప లు మేజర్ నాయకులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ అంశంతో ఉవ్వెత్తున దూసుకొచ్చారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గమంతా ఆయన వెనకే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాపులు టీడీపీ, బీజేపీ కూటమితో కాపు సామాజిక వర్గానికి చెందిన, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవటంతో.. అధికారంలోకి వస్తే కాపులను బీసీ వర్గాల్లో చేరుస్తామంటూ బాబు వాగ్దానం చేయడంతో ఆయనకు ఓట్లేసి గెలిపించారు.

కానీ అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులవుతున్నా ఆ అంశంపై ఏమాత్రం స్పందించకపోవడంతో.. దశాబ్దాల తరబడి నాయకులంతా వాళ్ళను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుండటంతో కాపు నేత ముద్రగడ కాపు ఐక్య గర్జన నిర్వహించి భారీ నిరసన తెలిపారు. ఇప్పుడు గనక చంద్రబాబు కాపులకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోతే కాపు నాయకుడు ముద్రగడ న్యాయకత్వంలో టీడీపీకి వ్యతిరేకంగా ఓ రాజకీయ పార్టీనే ఏర్పడే పరిస్థితి ఉంది. ఒకవేళ అలానే జరిగితే అతిపెద్ద సామాజిక వర్గం ఓ రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే మార్చే అవకాశముంది.