కార్యకర్తలకు బాబు భరోసా..!

Monday, October 13th, 2014, 05:04:13 PM IST


గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కార్యకర్తలు పార్టీకి దూరం కాకుండా ప్రభుత్వాన్ని, క్యాడర్ ని సమన్వయం చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సారి అధికారంలో కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు టీడీపీ బాస్. పదేళ్ల పాటు ప్రతి పక్షంలో ఉన్న కాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ ఆర్థిక భద్రత కల్పించే విధంగా చర్యలు ప్రారంభించారు. ప్రతి క్రియాశీల కార్యకర్తకు రెండు లక్షల రూపాయల మేర సౌకర్యం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ నేతృత్వంలో క్యాడర్ కు ఆర్థిక భద్రత కల్పించే ప్రక్రియ వేగంగా రూపుదిద్దుకుంటోంది. నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు ప్రక్రియకు సాంకేతిక ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వటంతో పాటు కార్యకర్తల ప్రయాణాలకు అయిదు నుంచి 20శాతం రాయితీ కల్పించేలా ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. తెలుగుదేశం పార్టీలో కార్యకరల్తకు పెద్ద పీట వేసే దిశగా నారా లోకేష్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. 50రూపాయలుగా ఉన్న కార్యకర్త సభ్యత్వ నమోదు రుసుమును 100రూపాయలకు పెంచి అవసరమైతే మరికొంత డబ్బును పార్టీ తరఫున జమ చేసి ప్రతి క్రీయాశీల కార్యకర్తకు రెండు లక్షల రూపాయల మేర భీమా సౌకర్యం కల్పించనున్నారు. కార్యకర్త ఎవరైనా చనిపోతే పది రోజుల్లోనే కుటుంబ సభ్యులకు భీమా సంస్థ తరఫున చెక్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కార్యకర్త ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే 40వేల రూపాయలు అందేలా భీమా సౌకర్యం కల్పించనున్నారు.

క్రీయాశీల కార్యకర్త ఎవరైనా చనిపోతే వారికున్న ఇద్దరి పిల్లల వరకు చెరో 10వేల రూపాయల చొప్పున విద్యా ఖర్చులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఈ సారి పూర్తి సాంకేతికంగా చేపట్టనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ నుంచి మండలానికో బృందాన్ని పంపనున్నారు. వారు గ్రామస్థాయి వరకూ వెళ్లి కార్యకర్తల వివరాలు సేకరిస్తారు. వారి దగ్గరున్న ఓటరు గుర్తింపు కార్డు నమూనా కూడా సేకరించి కార్యకర్తలందరికీ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఇస్తారు. క్రియాశీల కార్యకర్త గుర్తింపు కార్డు ఉన్న వారికి వివిధ ఆస్పత్రులు, ప్రైవేటు రవాణా సంస్థల్లో అయిదు నుంచి 20శాతం వరకూ రాయితీ కల్పించాలని యోచిస్తున్నారు. ఇందుకు వివిధ ప్రైవేటు సంస్థలతో పార్టీ ఒప్పందం కుదుర్చుకోనుంది.

ఇటీవల జరిగిన టిడిపి పోలిట్ బ్యూరో సమావేశానికి ఈ ప్రతిపాదనను పంపారు చినబాబు. కార్యకర్తలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ ప్రతిపాదనలకు పోలిట్ బ్యూరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.