ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా?

Thursday, March 4th, 2021, 06:35:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన తో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహ లతో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్తితి ఉందని విమర్శించారు. అయితే కర్నూల్ లో నిర్వహించిన రోడ్ షో లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మత సామరస్యం దెబ్బ తిన్నది అంటూ చెప్పుకొచ్చారు. ఆలయాల పై దాడులు చేస్తున్నారు అని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ హయాంలో అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి విధ్వంసానికి పెద్ద పీఠ వేశారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతి, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు బలవంతపు ఏక గ్రీవాలు చేశారు అంటూ మండిపడ్డారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏక గ్రీవాలున్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలను వైసీపీ నేతలు తమ ఖాతా లోకి వేసుకున్నారు అని వ్యాఖ్యానించారు. ఓటేసే అవకాశం లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా అని, ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.