అందుకే లాక్‌డౌన్ విధించడం లేదు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

Friday, April 16th, 2021, 10:30:50 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని కోవిడ్‌ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు గతంలో చాలా బాగా పని చేశారని ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పని చయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అయితే కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ శాశ్వత పరిష్కారమని అయితే వాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదే కానీ మన చేతుల్లో ఏమీ లేదని అన్నారు.

అయితే వ్యాక్సిన్ కొరతపై కేంద్రానికి లేఖ రాశామని వీలైనన్ని డోసులను ఏపీకి పంపించాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.03 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదని, లాక్‌డౌన్‌ విధించకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి అవసరం ఉందని అన్నారు. అయితే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్టు చేయడం, స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి కూడా వెంటనే టెస్టులు చేసేలా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 26 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, ప్రస్తుతం వాటిని 50 వేల బెడ్లకు పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.