కరోనా కారణంగా మళ్ళీ విద్యాసంస్థలను మూసివేయడంతో ప్రైవేటు స్కూల్ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ తాజాగా వారికి ఓ గుడ్న్యూస్ చెప్పారు. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకుంటామని ప్రతి నెలా రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పొందేందుకు ప్రైవేట్ టీచర్లు, ఇతర సిబ్బంది బ్యాంక్ అకౌంట్, తదితర వివరాలను జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు.
అయితే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు లక్షా యాబై వేల మంది ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.