సీఎం పదవి తనకు తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష – కేసీఆర్

Wednesday, April 14th, 2021, 10:31:12 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ నోముల భగత్‌ను గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. 30 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే జానారెడ్డి సాగర్ ప్రజలకు చేసిందేమి లేదని అన్నారు. నందికొండను మున్సిపాలిటీని చేశామని టీఆర్ఎస్‌ను గెలిపిస్తే నందికొండ భూములకు పట్టాలు నేనే స్వయంగా వచ్చి ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత పాలకులు వదిలేసిన తిరుమలగిరి సాగర్‌‌ లిఫ్ట్‌ను భిక్షమెత్తైనా ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని అన్నారు. నాగార్జున సాగర్‌కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

అయితే కేసీఆర్‌కు జానారెడ్డే సీఎం పదవి భిక్ష పెట్టాడని కొందరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, తనకు సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష అని కేసీఆర్ అన్నారు. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ కోసం పదవులు వదిలేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని అన్నారు. అసలు కాంగ్రెస్ జెండా సక్కగా ఉంటే, టీఆర్ఎస్ జెండా ఎందుకు ఎగిరేదని కేసీఅర్ అన్నారు. కేసీఆర్ సభ జరగొద్దని, సాగర్ ప్రజలను తాను కలవొద్దని కొందరు కుట్రలు చేశారని ఎవరెన్ని కుట్రలు చేసినా వాస్తవాలను ప్రజలు దృష్టిలో ఉంచుకుని నోముల భగత్‌ను గెలిపించుకోవాలని విజ్ణప్తి చేస్తూ, స్థానిక నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.