మోడీ ‘యాక్షన్’ పీఎం కాదట.. ‘ఆక్షన్’ పీఎం అట!

Friday, August 21st, 2015, 04:46:28 PM IST


బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ రాష్ట్రానికి భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్ లోని జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్యాకేజీ చుక్కలు చూపిస్తోంది. ఇక ఎన్నికలలో భాజపా విజయశంఖం మోగించడానికి ‘స్పెషల్ ప్యాకేజీ’ మోడీ వేసిన అతిపెద్ద ఎత్తుగా విపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ యాక్షన్ పీఎం కాదని, ఆక్షన్ పీఎం అని వ్యాఖ్యానించారు. అలాగే మోడీ బొగ్గు గనులను, స్పెక్ట్రమ్ ను వేలం వేశారని, ఇప్పుడు బీహార్ ను వేలానికి పెట్టి రాష్ట్రంతో తమాషా చేస్తున్నారని జైరామ్ మండిపడ్డారు. ఇక ఎంత ప్యాకేజీ కావాలి? అని సభకు హాజరైన ప్రజలను మోడీ అడగడం వారి ఆత్మగౌరవంతో ఆడుకోవడమేనని, ఈ పరిహాసాన్ని బీహార్ ప్రజలు సహించరని జైరామ్ రమేష్ ధ్వజమెత్తారు.