నోములకు మంత్రి‌ పదవి ఎందుకు ఇవ్వలేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్న..!

Tuesday, April 13th, 2021, 10:15:39 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, కౌన్సిల్‌ ఛైర్మన్‌ను చేశారని, 2014 లో నాగార్జున సాగర్‌లో ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య ఓడిపోతే ఎందుకు పదవి ఇవ్వలేదని అన్నరు. కమ్యూనిస్టు లో‌ ఉన్నపుడు నోముల నర్సింహయ్య అన్ని రంగాల కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ‌గళం వినిపించారని, 2018లో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నోములకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. నోముల నోరెత్తకుండా రాజకీయంగా ఆయనను సమాధి చేసింది సీఎం కేసీఆర్ కాదా అని నిలదీశారు.

అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి‌, ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డికి టికెట్ ఇవాలని ముందుగా అనుకున్నారని కానీ చివరి నిమిషంలో నోముల భగత్‌కు టికెట్ ఇచ్చారని ఇది నోముల కుటుంబానికి అవమానం ‌కాదా అని అన్నారు. ఓడిపోయే టికెట్ నోముల కుటుంబానికి ఇచ్చాడని.. అలా చేయకుండా ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చు కదా అని అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కోసం ‌రెండోసారి సీఎం కేసీఆర్ సభ అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్టేనని, కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ నాగార్జున సాగర్‌కు రాబోతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తూ రేపు హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ పెడుతున్నారని, కరోనా నిబంధనలు ప్రతిపక్షాలకేనా అధికార పార్టీకి లేవా అంటూ ఎన్నికల కమీషన్‌ను ప్రశ్నించారు.