ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అయితే నిత్యం పలు రకాల వీడియో సందేశాలను, మీమ్లను పోస్టు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. మీ పిల్లలు బండి నడిపే ప్రవర్తనపై నిఘా పెట్టండి, వారు తరచూ ఉల్లంఘనలు చేస్తూ ఉంటే వారికి బండి ఇవ్వకండని తల్లిదండ్రులకు సూచిస్తూ ఓ సరదా వాట్సాప్ చాట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
అసలు ఆ వాట్సాఫ్ చాట్ తండ్రీ కొడుకుల మధ్య జరిగింది. అందులో ఏముందంటే ట్రాఫిక్ చలాన్లు తండ్రి మొబైల్ ఫోన్‌కు రాగా ఆ మెసేజ్‌ను తన కొడుకు వాట్సాప్ నంబర్‌కు ఫార్వార్డ్ చేస్తాడు. ఏంట్రా ఇది అని కొడుకుని తండ్రి ప్రశ్నించగా ఏమో నాన్న.. రాంగ్ చలానా అనుకుంటా అని ఆ అబ్బాయి సమాధానమిస్తాడు. అవునా.. మరి ఇదేంటో అంటూ చలాన్‌కు సంబంధించిన ఫఒటోను పంపిస్తాడు. అప్పుడు కొడుకు సారీ నాన్న కాలేజీకి వెళ్లే తొందరలో అలా వెళ్లాను అని రిప్లై ఇస్తాడు. అయితే ఆ తండ్రి వెంటనే మీ కాలేజీ కోఠీలో కదరా.. ఇన్ ఆర్బిట్ మాల్లో స్పెషల్ క్లాస్ చెప్తున్నారా.. ఇంటికి రా మాట్లాడాలని అంతేకాదు కోఠీకి ఏ బస్సు వెళుతుందో తెలుసుకుని రా.. రేపటి నుంచి అందులోనే వెళ్లాలి అంటూ షాక్ ఇచ్చాడు. అయితే ఈ సంభాషణ హాస్యాన్ని పుట్టించిన, చక్కని సందేశమంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
మీ పిల్లలు బండి నడిపే ప్రవర్తనపై నిఘా పెట్టండి. వారు తరచూ ఉల్లంఘనలు చేస్తూ ఉంటే వారికి బండి ఇవ్వకండి.
మీ బండి పై పడే చలానాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి. https://t.co/qZW34WI1wk pic.twitter.com/Adee3dr3Uk
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) January 21, 2021