మోగిన ఎన్నికల నగారా.. ప్రజల చూపు ఎటువైపు..!

Monday, January 12th, 2015, 06:17:59 PM IST


ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపడంతో ఢిల్లీ రాష్ట్రపతి పాలన కిందకు వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే, రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 15తో ముగియనున్నది. ఈ లోపుగానే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమయింది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగ, ప్రధానమైన మూడు పార్టీలు (బీజేపి, ఏఏపీ, కాంగ్రెస్) ఎన్నికలలో పోటీలకు సిద్దం అయ్యాయి. ముఖ్యంగా బీజేపి, ఏఏపీ పార్టీల మధ్య పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే, కొన్నిసంస్థలు సర్వేను సైతం నిర్వహించాయి. ఆ సర్వేలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వేలుగుచూసినట్టు తెలుస్తున్నది. పార్టీ పరంగా చూసుకుంటే, ఢిల్లీ ప్రజలు బీజేపి వైపు మొగ్గు చూపుతున్నారని, అదే వ్యక్తిగతంగా చూసుకుంటే, ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, ప్రజలు ఎవరికీ పట్టం కడతారో తేలాలంటే మాత్రం ఫిబ్రవరి 10వరకు ఆగాల్సిందే.

ఇక ఢిల్లీ తో పటు దేశంలో మరికొన్ని స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి కూడా ఉన్నది. తిరుపతి ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనున్నది. అయితే, సాంప్రదాయకంగా అక్కడి ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందా… లేక, సాంప్రదాయానికి విరుద్దంగా అన్ని పార్టీలు ఎన్నికలలో పోటీ చేస్తాయో తెలియాలంటే నోటిఫికేషన్ వెలువడే వరకు వేచి ఉండాల్సిందే.