నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి.. డీజీపీ కీలక ఆదేశాలు..!

Wednesday, April 21st, 2021, 02:00:18 AM IST

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే ఈ రోజు రాత్రి నుంచే కర్ఫ్యూ మొదలవుతుందని, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ఆ ఆంక్షలు 30వ తేది వరకు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కోసం పట్టిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

నేడు పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ మహేందర్ రెడ్డి నైట్ కర్ఫ్యూపై పలు ఆదేశాలు జారీ చేశారు. నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఒకేలా ఉండేలా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కర్ఫ్యూపై తొలిరోజు ప్రజల్లో అవగాహన కల్పించాలని, కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని డీజీపీ సూచించారు. కర్ఫ్యూ మినహాయింపు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలని, నైట్ కర్ఫ్యూపై ప్రజలు సహకరించాలని కోరారు. ఇకపోతే అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకు రవాణా వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని డీజీపీ చెప్పుకొచ్చారు.