ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు దూరదర్శన్ యాంకర్ అతని పేరులోని ఎక్స్ ఐ(XI)ని రోమన్ పదాలు అనుకుని ఎలెవన్ గా పలకడంతో చెలరేగిన వివాదం ముగియకముందే దూరదర్శన్ మరో చిక్కుల్లో పడింది. వివరాలలోకి వెళితే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ గోవాలో నవంబర్ 20న ప్రారంభమైన సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిధులను పలకరిస్తూ గోవా గవర్నర్ మృదులా సిన్హాను ఉద్దేశించి ‘గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలను మనతో పంచుకుంటారు’ అని పేర్కొంది. ఇక గవర్నర్ ఆఫ్ ఇండియా అని అనడమేకాక స్త్రీ అయిన మృదులా సిన్హాను అతడుగా వ్యవహరించడం గమనార్హం.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో దూరదర్శన్ పై విమర్శలు చెలరేగాయి. అయితే తాము ఆ వీడియోలోని పొరపాటు సరిచేసి నాలుగు నిమిషాల్లో పునఃప్రసారం చేశామని, జరిగిన తప్పుకు గల కారణాలను తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారులను ఆదేశించామని, ‘గవర్నర్ ఆఫ్ ఇండియా’ అన్న యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగి అని దూరదర్శన్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే ఒకదాని వెనుకగా మరొకటి పొరపాట్లు చేస్తుండడంతో దూరదర్శన్ పై తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.